నమస్తే శేరిలింగంపల్లి:పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలను తగ్గించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శి అంగడి పుష్ప డిమాండ్ చేశారు. ఏఐఎఫ్ డీ డబ్ల్యు సమాఖ్య గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం మియాపూర్ ముజాఫ్ఫార్ అహ్మద్ నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ నిరసన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శి అంగడి పుష్ప మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా అడ్డూఅదుపు లేకుండా గ్యాస్, నిత్యవసర వస్తువుల, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూల చట్టాలను తీసుకువచ్చి వాటి అమలులో భాగంగా 30 రోజులలో 23 సార్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి పేద బడుగు బలహీన వర్గాల పై పెనుభారం మోపుతుందన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే ప్రభుత్వాలు తగ్గించాలని డిమాండ్ చేశారు.