శేరిలింగంపల్లి, జూన్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో అక్రమంగా తవ్వుతున్న సెల్లార్ గుంతలపై చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప సొసైటీలో అనేక అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని అన్నారు. పైగా అనుమతులు లేకుండానే అక్రమంగా భారీ సెల్లార్ గుంతలను తవ్వుతున్నారని అన్నారు. అయ్యప్ప సొసైటీ ప్లాట్ నంబర్ 39కి ఎదురుగా భారీ సెల్లార్ గుంతను తవ్వుతున్నారని తెలిపారు. దీనిపై సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులను ప్రశ్నించినా స్పందించడం లేదన్నారు. సర్కిల్ ఉపకమిషనర్ మోహన్ రెడ్డికి ఇదే విషయమై తాను వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశానని, అయితే ఆయన తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశారని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోన్‌ను అలా బ్లాక్ చేయడం ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. అధికారులు ఇప్పటికైనా మేల్కొని అక్రమ సెల్లార్ గుంతల తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు.