నమస్తే శేరిలింగంపల్లి: భారత రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడిన సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు వనం సుధాకర్ డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ మియాపూర్ ప్రాంతంలోని నడిగడ్డ తండాలో అంబేద్కర్ విగ్రహానికి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వనం సుధాకర్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ లతో కలిసి బిజెపి ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం వత్తాసు పలుకుతూ అనువాదాన్ని అమలు చేయడానికి ప్రయత్నం లో భాగంగానే రాజ్యాంగాన్ని మార్చాలనే వాదన చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దేశ బడ్జెట్ లో బడుగు, బలహీన వర్గాలకు, బహుజనులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోవడాన్ని కేసీఆర్ వ్యతిరేకించకుండా, బడ్జెట్ ను పక్కదారి పట్టించేందుకు భారత రాజ్యాంగం మార్చాలని తప్పుడు వాదన చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలనే కేసీఆర్ ఆలోచనను విరమించుకొని జాతికి క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ శేరిలింగంపల్లి ఇంచార్జీ రాములు, బీఎల్ఎఫ్ నాయకులు వి. తుకారం నాయక్, బీఎస్పీ శేరిలింగంపల్లి అధ్యక్షుడు నర్సింగ్ ముదిరాజ్, ఏఐసీటీయూ, ఏఐఎఫ్ డీఎస్ రాష్ట్ర అధ్యక్షులు టి అనిల్ కుమార్, పల్లె మురళి, అఖిల భారత బంజారా సేవ సంఘ్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్, నాయకులు డి. నరసింహా, దారా లక్ష్మి, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.