నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది వేడుకల్లో భాగంగా హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం దిగ్విజయంగా విజయవంతం చేసిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలందరికి ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏకగ్రీవంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన కేసీఆర్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్లీనరీ సమావేశం విజయవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు, ఏర్పాట్లలో నిమగ్నమై అహర్నిశలు కృషి చేసిన కమిటీ సభ్యులందరికి, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ధన్యవాదాలు తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హైటెక్స్ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం అట్టహాసంగా జరగడం చాలా సంతోషకరమని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దంపడుతూ ద్విదశాబ్దిని పూర్తి చేసుకుని, రానున్న కాలంలో మరింత నిబద్ధతతో పని చేసే దిశగా ఈ ప్లీనరీ సమావేశం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు స్ఫూర్తి నిచ్చిందని చెప్పారు. పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి నడిచి తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం పునరంకితం అవుదాం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.