నమస్తే శేరిలింగంపల్లి: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా హైదరాబాద్ హైటెక్ సిటీ రెడిసన్ లో ఎంతో ఉత్సాహబరితమైన, వినూత్నమైన క్రిస్టమస్ ట్రీ ని ఆవిష్కరించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం క్రిస్మస్ పండగకు ముత్యాల తో అందంగా అలంకరించిన క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేయడం ఆకర్షణీయంగా నిలిచింది. రెడిసన్ హోటల్ లో రాదేకృష్ణ జెమ్స్, జ్యూవలరీ వారితో కలసి రూ. 25 వేలకు పైగా ముత్యాలను వినియోగించి తయారు చేసిన ముత్యాల క్రిస్టమస్ ట్రీని క్రైస్తవ మత పెద్దలు, ఇతర విశిష్ట అతిధుల సమక్షంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రెడిసన్ మేనేజర్ పవన్ కుమార్ మాట్లాడుతూ గత ఏడాది రూ. 35 లక్షల విలువైన పోచంపల్లి చీరలతో ఏర్పాటు చేసిన క్రిస్టమస్ ట్రీ అందరి మన్ననలు అందుకుందని అన్నారు. పోచంపల్లి చీరలతో ఏర్పాటు చేసిన క్రిస్టమస్ ట్రీ గత ఏడాది స్థానిక కళను ప్రోత్సహించగలిగిందని, అదే కోవలో ఈ సంవత్సరం హైదరాబాద్ ముత్యాలతో ప్రత్యేకమైన క్రిస్టమస్ ట్రీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తద్వారా నిజాం కాలం నుండి సిటీ ఆఫ్ పెరల్స్ గా హైదరాబాద్ గడించిన పేరును మరో మారు గుర్తుకు చేయడమే దీని లక్ష్యమని అన్నారు. రెడిసన్ హైటెక్ సిటీ వారు ఎళ్లవేళలా వోకల్ ఫర్ లోకల్, లోకల్ ఫర్ గ్లోబల్ నినాదాల ప్రాముఖ్యతను గుర్తించడమే కాకుండా ఈ లక్ష్యాన్ని సాధించడానికి స్థానిక బ్రాండ్ లతో కలసి పని చేస్తోందని వివరించారు. ఈ క్రిస్టమస్ వేడుకలకు మన నగరపు సాంప్రదాయం, సంస్కృతిని ప్రదర్శించడమే కాకుండా హైదరాబాద్ ముత్యాలకు ప్రాచుర్యం కలిపించాలని నిర్ణయించిందన్నారు. తద్వారా స్థానిక చిన్న వ్యాపారాలకు సహాయం అందించినట్లు అవుతుందన్నారు. మనకు ప్రకృతి ప్రసాదించిన వరం, ఆభరణాలకు రాణి అయిన ముత్యాలు ఎప్పటి నుండో హైదరాబాద్ సంస్కృతిలో భాగమయ్యాయి అని అన్నారు. నగరంలోని ముత్యాల పరిశ్రమ నానాటికీ అభివృద్ది చెందుతూ ఎందరికో ఉపాధి కల్పిస్తోందని చెప్పారు. ఎంతో ప్రాచుర్యం పొందిన హైదరాబాద్ ముత్యాలతో కూడిన ప్రత్యేకమైన స్థానిక సంస్కృతి ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించడమే లక్ష్యంతో ఈ వినుత్నమైన కార్యక్రమానికి స్వీకారం చుట్టామని వివరించారు.