నమస్తే శేరిలింగంపల్లి: విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత చందానగర్ అన్నపూర్ణ ఎన్ క్లేవ్ లోని షిరిడి సాయి, అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో శ్రీ షిర్డి సాయినాథ దేవాలయ దశమ వార్షికోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తర పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి వార్ల దివ్యాశీస్సులతో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం కాకడ హారతి, అష్టోత్తర కలశాభిషేకం, అలంకరణ, అర్చనలు, నిత్య హోమాలు, పూర్ణాహుతి పూజలు నిర్వహించారు. పండిత సత్కారం, దాతలకు ఆశీర్వచనం అనంతరం కోనేరు ప్రసాద్ లక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు నిర్వహించిన మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని కృపకు పాత్రులయ్యారు.