నమస్తే శేరిలింగంపల్లి: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఇన్ స్పెక్టర్ సురేష్ వివరాలను వెల్లడించారు. గంజాయి విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో గౌలిదొడ్డి హ్యుండాయ్ షోరూం వద్ద నిఘా ఉంచామన్నారు. ఆదిత్య కుమార్ ఠాకూర్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా రెండు బ్యాగులతో కనిపించగా పోలీసులు తనిఖీ చేపట్టారు. బ్యాగులో 22 కిలోల గంజాయిని గుర్తించారు. ఆదిత్య కుమార్ ఠాకూర్ ను విచారించగా ఒడిస్సాకు చెందిన సందీప్ అలియాస్ సర్జిత్ సర్దార్ వద్ద గంజాయిని కొని నానక్‌రాం గూడ, పరిసర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిపాడు. ఒడిస్సా నుంచి హైదరాబాద్ కు గంజాయిని సరఫరా చేస్తూ విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. ఆదిత్య కుమార్ తో పాటు సందీప్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను జ్యుడిషియల్ రిమాండుకు తరలించినట్లు చెప్పారు.