శేరిలింగంపల్లి, నవంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహేంద్ర అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై పోలీస్ శాఖ స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల వేధింపులు, బెదిరింపులు లేదా ఒత్తిడి కారణం కాదని చంద్రానగర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఎ. శ్రీధర్ కుమార్ స్పష్టం చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నవంబర్ 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు రాములు అనే వ్యక్తి చంద్రానగర్ పోలీస్ స్టేషన్కు వచ్చి మహేంద్ర తనను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు బెదిరించినట్లు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై అదే రోజు మహేంద్రను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ సరైన స్పందన రాలేదని పోలీసులు తెలిపారు. దీంతో రాములును లిఖితపూర్వక ఫిర్యాదు అందించాలని సూచించగా, అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు చట్టపరమైన విధివిధానాలు పాటించి అదే రోజు రాత్రి 9 గంటలకు Cr.No.1246/2026గా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఈ కేసులో భాగంగా నవంబర్ 26వ తేదీన దర్యాప్తు అధికారి హెడ్ కానిస్టేబుల్ దాసు (నెం.3065) మహేంద్రకు నోటీసు అందజేసేందుకు అతని నివాసానికి వెళ్లారు. అయితే ఆ సమయంలో మహేంద్ర ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్యకు, అత్తకి కేసు విషయాన్ని తెలియజేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత మహేంద్ర ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఫిర్యాదుదారుడు సమర్పించిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగానే చట్టప్రకారం కేసు నమోదు చేసి పోలీసు విధులు నిర్వహించామని ఎస్హెచ్ఓ స్పష్టం చేశారు. పోలీసు సిబ్బందిలో ఎవరూ మహేంద్రను వేధించలేదని, బెదిరించలేదని, అనవసర ఒత్తిడికి గురిచేయలేదని వెల్లడించారు.





