శేరిలింగంపల్లి, నవంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): సురక్షితమైన, సులభతరమైన పాఠశాల ప్రయాణాల కోసం విద్యార్థులు అందించిన వినూత్న సూచనలు ఆలోచింపజేశాయి. సైబరాబాద్ మూవ్స్ 2026 కార్యక్రమంలో రెండో రోజు భాగంగా సైబరాబాద్ పరిధిలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో రహదారి భద్రత, రవాణా సమస్యలు, మెరుగైన ప్రయాణ సౌకర్యాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ డాక్టర్ జి. సృజన, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అదనపు డిప్యూటీ కమిషనర్ జి. హనుమంతరావు, ట్రాఫిక్ పోలీస్, IRCTC అధికారులు విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. పాఠశాలలకు వెళ్లే సమయంలో ప్రతిరోజూ ఎదురవుతున్న రవాణా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ట్రాఫిక్ రద్దీ, వాహనదారుల అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రహదారులపై గుంతలు, పాఠశాలల పరిసరాల్లో భద్రతా లోపాలు వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వీటి పరిష్కారానికి కార్‌పూలింగ్, బాధ్యతాయుతమైన డ్రైవింగ్, మెరుగైన రహదారి భద్రతా చర్యలు, ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడం వంటి ఆచరణాత్మక సూచనలు చేశారు. వీటి ద్వారా పాఠశాల ప్రయాణాలను సురక్షితంగా మార్చడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడవచ్చని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు చురుకుగా పాల్గొని విలువైన సూచనలు అందించడంపై అధికారులు అభినందనలు తెలిపారు. విద్యార్థులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా CMC కమిషనర్ డాక్టర్ జి. సృజన మాట్లాడుతూ సైబరాబాద్ భవిష్యత్తు నిర్మాణంలో విద్యార్థులు కూడా చురుకైన భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రహదారి భద్రత, సుస్థిర రవాణా వ్యవస్థ, మెరుగైన పట్టణ అనుసంధానత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని సూచించారు. పిల్లల అభిప్రాయాలను గౌరవిస్తూ పట్టణ ప్రణాళిక, నిర్ణయాల రూపకల్పనలో యువతను భాగస్వాములను చేయడం ద్వారా సురక్షితమైన, సమ్మిళితమైన, బాలల స్నేహపూర్వక సైబరాబాద్‌ను నిర్మించవచ్చని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.





