శేరిలింగంపల్లి, నవంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ క్రాస్ రోడ్‌లోని కొత్తగూడ గ్రామ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ అడ్వకేట్ హెచ్. బాల్ రెడ్డి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ సృజనకు ఫిర్యాదు చేశారు. తన స్థలానికి తూర్పు వైపున ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణ పనులు చేపడుతున్నారని, ఈ వ్యవహారంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. సర్వే నంబర్లు 17, 18లోని ఇంటి నంబర్ 2-41/14/1/Bలో ఉన్న 599 చదరపు గజాల స్థలం తన సొంతమని, ప్రస్తుతం ఆ స్థలాన్ని హోటల్ నిర్వహణ కోసం ఓ అద్దెదారుకు ఇచ్చినట్లు బాల్ రెడ్డి తెలిపారు.

తన స్థలానికి తూర్పు వైపున అశోక్ అనే కాంట్రాక్టర్ ఎలాంటి నిర్మాణ అనుమతులు, సంబంధిత పత్రాలు చూపించకుండా బహుళ అంతస్తుల భవన నిర్మాణ పనులు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో తన స్థలానికి సంబంధించిన కాంపౌండ్ వాల్‌ను సైతం కూల్చివేశారని, సెల్లార్ నిర్మాణం కోసం తవ్వకాలు చేపడుతూ పిల్లర్లను ఏర్పాటు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మున్సిపల్ నిబంధనల ప్రకారం పాటించాల్సిన సెట్‌బ్యాక్‌లను కూడా వదలకుండా నిర్మాణం చేపడుతున్నారని, దీనివల్ల తన ఆస్తికి నష్టం వాటిల్లడంతో పాటు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. రాములు గౌడ్‌కు చెందిన స్థలంలో ఆయన తరఫున అశోక్ కాంట్రాక్టర్ ఈ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ అక్రమ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని, అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

నిర్మాణ పనులను అడ్డుకోకపోతే భవిష్యత్తులో వివాదాలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టర్ అశోక్, స్థల యజమాని రాములు గౌడ్‌తో పాటు సంబంధిత మున్సిపల్ అధికారులపై కూడా న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు CMC కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు అందజేశారు. సంబంధిత అధికారులకు ప్రతులు పంపిస్తూ అక్రమ నిర్మాణాలను అడ్డుకుని, తదుపరి న్యాయవివాదాలు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.






