శేరిలింగంపల్లి, నవంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): గ్రీన్ వాటర్ ట్యాంకర్ల నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ సృజన తీవ్ర చర్యలు చేపట్టారు. డ్రైనేజీ నుంచి సేకరించిన నీటిని గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు వచ్చిన వార్తలను తీవ్రంగా పరిగణించిన కమిషనర్.. బాధ్యులైన సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.

నీటి సంరక్షణలో భాగంగా తాగునీటిని కేవలం తాగడానికి మాత్రమే వినియోగించాలని, నిర్మాణ పనులు, పార్కులు, పచ్చదనం నిర్వహణ వంటి అవసరాలకు శుద్ధి చేసిన మురుగునీటిని (STP Treated Water) వినియోగించాలనే లక్ష్యంతో CMC గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలను ప్రోత్సహిస్తోంది. అయితే ఈ సేవల నిర్వహణలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు స్పందించారు. ఈ క్రమంలో శేరిలింగంపల్లి సర్కిల్ మేనేజర్‌గా, నార్సింగి, పటాన్‌చెరు సర్కిళ్ల ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వహిస్తున్న విక్రమ్ చంద్రను సస్పెండ్ చేశారు. అవుట్‌సోర్సింగ్ సూపర్‌వైజర్ గోపాల్‌పై కూడా చర్యలు చేపట్టారు. గ్రీన్ వాటర్ ట్యాంకర్ల నిర్వహణలో అవకతవకలకు సంబంధించి సదరు కాంట్రాక్టర్‌కు జారీ చేసిన వర్క్ ఆర్డర్‌ను రద్దు చేశారు.
గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా నిర్దేశిత అవసరాలకు కేవలం ఎస్టీపీలలో శుద్ధి చేసిన నీటిని మాత్రమే సరఫరా చేయాలని CMC స్పష్టం చేసింది. నీటి సంరక్షణ లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో నిబంధనల ఉల్లంఘనను ఉపేక్షించబోమని, మార్గదర్శకాల అమలుపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని వెల్లడించింది. ఆదేశాలను ఉల్లంఘించే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.





