సైబరాబాద్‌లో రూ.169 కోట్లతో ట్విన్ టవర్ గ్రీన్ హెచ్‌ఓడీ.. నిర్మాణానికి టెండర్లు పిలిచిన CMC

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) శాశ్వత ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ట్విన్ టవర్ నెట్-జీరో గ్రీన్ బిల్డింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ఈ-టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఇజ్జత్‌నగర్‌లోని కొత్త కుంట చెరువు సమీపంలో 4.11 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.169 కోట్ల అంచనా వ్యయాన్ని కేటాయించారు. మొత్తం 2,41,540 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో ఈ కార్యాలయ సముదాయాన్ని నిర్మించనున్నారు. ఇందులో పరస్పరం అనుసంధానమైన రెండు టవర్లు ఉంటాయి. ఒకటి జీ+6 అంతస్తులతో, మరొకటి జీ+8 అంతస్తులతో రూపుదిద్దుకోనున్నాయి. కార్పొరేషన్ ప్రస్తుత, భవిష్యత్తు పరిపాలనా అవసరాలకు అనుగుణంగా ఈ భవన సముదాయాన్ని రూపొందించారు.

ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు నూతన ప్రధాన కార్యాలయంలో విస్తృతమైన సదుపాయాలు కల్పించనున్నారు. ఇందులో కౌన్సిల్ హాల్, ప్రజావాణి హాల్, పౌర సేవా కేంద్రాలు, ఆడిటోరియం, సమీకృత కమాండ్ సెంటర్‌తో పాటు CMCలోని వివిధ విభాగాలు, అనుబంధ ప్రభుత్వ సంస్థలకు ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో ఆధునిక గ్రీన్ బిల్డింగ్ సాంకేతికతలు, సుస్థిర నిర్మాణ విధానాలకు పెద్దపీట వేయనున్నారు. పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, ఇంధన సామర్థ్య మౌలిక సదుపాయాలు, నీటి సంరక్షణ చర్యలు, మురుగునీటి శుద్ధి, పునర్వినియోగ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు స్మార్ట్ బిల్డింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన నిర్మాణ రూపకల్పనను అమలు చేయనున్నారు. తద్వారా నెట్-జీరో ప్రమాణాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

సుస్థిర పట్టణాభివృద్ధి, ఆధునిక సాంకేతికత, ప్రజాకేంద్రిత పాలనకు ప్రతీకగా ఈ నూతన ప్రధాన కార్యాలయాన్ని తీర్చిదిద్దనున్నారు. తెలంగాణలో పర్యావరణహిత ప్రభుత్వ భవన నిర్మాణాలకు ఆదర్శంగా నిలిచేలా, సైబరాబాద్‌కు ఒక ఐకానిక్ సివిక్ ల్యాండ్‌మార్క్‌గా ఈ ట్విన్ టవర్ కాంప్లెక్స్ రూపుదిద్దుకోనుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సైబరాబాద్ ప్రాంతానికి ఆధునిక, సమర్థవంతమైన పరిపాలనా కేంద్రంగా ఈ భవనం సేవలందించనుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here