శేరిలింగంపల్లి, నవంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్లోని 550 ఎకరాల ప్రభుత్వ భూములను వేలం వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, వాటిని ప్రజా అవసరాల కోసం వినియోగించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల వేలం నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష సంతకాల ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మక్తా మహబూబ్పేట్ డివిజన్, పోచమ్మ టెంపుల్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మియాపూర్లోని విలువైన 550 ఎకరాల ప్రభుత్వ భూములను విక్రయించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ భూములను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించకుండా స్థానిక ప్రజల అవసరాలకు కేటాయించాలని సూచించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్థలంలో ప్రభుత్వ ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేయడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు 200 ఎకరాల విస్తీర్ణంలో ఆక్సిజన్ పార్క్ నిర్మించాలని ప్రతిపాదించారు. అభివృద్ధి కోసమే పార్టీలు మారామని చెబుతున్న స్థానిక ఎమ్మెల్యే, మాజీ కార్పొరేటర్లు ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలని రవికుమార్ యాదవ్ సవాల్ విసిరారు. ప్రభుత్వ భూముల వేలం అంశంపై ప్రజాభిప్రాయాన్ని సేకరించి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకే లక్ష సంతకాల కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీజేపీ నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాణిక్ రావు, సీతారామరాజు, దుర్గాప్రసాద్, గణేష్ ముదిరాజ్, రాజేష్ గౌడ్, శ్రీనివాస్, ఆకుల లక్ష్మణ్, రాము, ఎల్లేష్, నరసింహారావు, బాబు ముదిరాజ్, జితేందర్, విజేందర్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.





