హోటళ్లు, రెస్టారెంట్లకు CMC కీలక సూచనలు.. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనల‌పై అవగాహన కార్యక్రమాలు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 అమలులో భాగంగా హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. వ్యర్థాల నిర్వహణలో పాటించాల్సిన నిబంధనలు, తప్పనిసరి రిజిస్ట్రేషన్ ప్రక్రియపై నిర్వాహకులకు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) రూపొందించిన అధికారిక పోర్టల్ www.swm.cpcb.gov.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని వివరించారు. ఘన వ్యర్థాల నిర్వహణలో హోటళ్లు, రెస్టారెంట్లు అనుసరించాల్సిన బాధ్యతలు, నిబంధనలపై సీఎంసీ క‌మిష‌న‌ర్ సృజ‌న అవగాహన కల్పించారు.

ముఖ్యంగా వ్యర్థాలను ఉత్పత్తి అయిన ప్రదేశంలోనే నిర్దేశిత విభాగాల ప్రకారం వేరు చేయాలని సూచించారు. తడి వ్యర్థాలను హోటళ్లు, రెస్టారెంట్ల ప్రాంగణాల్లోనే శాస్త్రీయ పద్ధతుల్లో శుద్ధి చేసేందుకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాలు, విధానాలను వివరించారు. ప్రాంగణంలో శుద్ధి సాధ్యం కాని వ్యర్థాలను అధీకృత వ్యర్థాల నిర్వహణ కేంద్రాలకు తరలించి, శాస్త్రీయ పద్ధతుల్లో సేకరణ, రవాణా, శుద్ధి చేపట్టాల్సిన అవసరాన్ని తెలియజేశారు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు CPCB పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, సంబంధిత మార్గదర్శకాలను పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. ఘన వ్యర్థాల నిర్వహణలో అన్ని వర్గాల భాగస్వామ్యాన్ని పెంచడం, బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణ పద్ధతులను ప్రోత్సహించడం, మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థపై భారాన్ని తగ్గించడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు ఇతర బల్క్ వేస్ట్ జనరేటర్లు (Bulk Waste Generators) కూడా వ్యర్థాలను మూలస్థాయిలోనే వేరు చేయడం, శాస్త్రీయ పద్ధతుల్లో శుద్ధి చేయడం, నిర్ణీత సమయంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం వంటి చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని CMC అధికారులు సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here