శేరిలింగంపల్లి, నవంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): సగరుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ హామీ ఇచ్చారు. సగరుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, అవసరమైతే శాసనసభలోనూ వారి డిమాండ్లపై తన గళం వినిపిస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సగర సంఘం పిలుపు మేరకు, రాష్ట్ర సంఘం ఆమోదించిన తీర్మానాల ప్రకారం సగరుల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై తెలంగాణ రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం అధ్యక్షుడు మోడల రవి సగర ఆధ్వర్యంలో ప్రతినిధులు ఆరెకపూడి గాంధీని మంగళవారం వివేకానందనగర్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అంజయ్యనగర్, హఫీజ్‌పేట్, కొండాపూర్, లింగంపల్లి, రాయదుర్గం తదితర ప్రాంతీయ సంఘాల నాయకులు, నియోజకవర్గ సగర బంధువులు కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి తెలంగాణ రాష్ట్రం వరకు సగర సామాజిక వర్గానికి చెందిన ఒక్కరు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించకపోవడం విచారకరమన్నారు. సగరుల సమస్యలు, హక్కులు, కష్టాల గురించి చట్టసభల్లో ప్రస్తావించే గొంతుక లేకపోవడంతో ప్రభుత్వాల నుంచి తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సగరులకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. సగర ఫెడరేషన్‌ను కార్పొరేషన్‌గా మార్చి పాలక మండలిని నియమించాలని, జీవో 59ను సవరించి ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో సగరులకు రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని, సగరులను నిర్మాణ రంగ కార్మికులుగా గుర్తించి ఆరోగ్య భద్రత కార్డులతో పాటు పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని, హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై శ్రీశ్రీశ్రీ భగీరథ మహర్షి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, సగరులను బీసీ డి నుంచి బీసీ ఎ వర్గంలోకి మార్చాలని అన్నారు.
అనంతరం PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని సగరులు తనకు ఎంతో అండగా నిలిచారని, వారి అభ్యున్నతికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని అన్నారు. సగరుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. వారి సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని, అవకాశం వస్తే శాసనసభలోనూ సగరుల తరఫున మాట్లాడతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సగర సంఘం కోశాధికారి కానుగంటి శ్రీనివాస్ సగర, గ్రేటర్ ప్రధాన కార్యదర్శి ఆవుల వెంకట్రాములు సగర, గ్రేటర్ యువజన సంఘం మాజీ అధ్యక్షుడు ఎర్రంశెట్టి సీతారాం సగర, నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతీయ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు పాల్గొన్నారు.





