మియాపూర్ సర్కిల్‌లో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లపై అధికారుల సమీక్ష

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 23 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) మియాపూర్ సర్కిల్-48 పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, IGRS స్లాట్ బుకింగ్స్ క్లియరెన్స్‌పై డిప్యూటీ కమిషనర్ శ్రీ‌నివాస్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు (AMCs), ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు (TIs), బిల్ కలెక్టర్లు (BCs) హాజరయ్యారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ (PTIN) కేటాయింపులకు సంబంధించిన IGRS స్లాట్ బుకింగ్స్‌ను త్వరితగతిన క్లియర్ చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రాపర్టీ ట్యాక్స్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ఇతర సేవలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని సూచించారు.

అలాగే ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించి మెరుగైన పౌర సేవలు అందించాలని, నవంబర్ నెలకు నిర్దేశించిన ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు అంద‌రు AMCs, TIs, BCలకు నిర్దిష్ట లక్ష్యాలు, బాధ్యతలను కేటాయించారు. పెండింగ్ పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడంతో పాటు, వసూళ్ల పురోగతిపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని డిప్యూటీ కమిషనర్ సూచించారు. సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని ఆదేశించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here