శేరిలింగంపల్లి, నవంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ చౌరస్తా నుంచి ఆల్విన్ కాలనీ చౌరస్తా వరకు రూ.530 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఫ్లైఓవర్, అండర్పాస్ నిర్మాణ పనులకు సంబంధించి భూసేకరణ, రహదారి విస్తరణ తదితర అంశాలపై పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మియాపూర్ చౌరస్తా నుంచి ఆల్విన్ కాలనీ చౌరస్తా వరకు 1,790 మీటర్ల పొడవుతో ఆరు లేన్ల ద్విదిశాత్మక ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే హఫీజ్పేట్ నుంచి మియాపూర్ వరకు 24 మీటర్ల వెడల్పుతో మూడు లేన్ల ఏకదిశాత్మక అండర్పాస్, బాచుపల్లి నుంచి ఆల్విన్ కాలనీ చౌరస్తా వరకు మరో మూడు లేన్ల ఏకదిశాత్మక అండర్పాస్ నిర్మించనున్నారు.

ఈ నేపథ్యంలో ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ చౌరస్తా నుంచి హఫీజ్పేట్ వైపు చేపట్టనున్న అండర్పాస్, రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో గాంధీ సమీక్షించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా ఆల్విన్ కాలనీ చౌరస్తా నుంచి హఫీజ్పేట్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) వరకు ప్రతిపాదించిన 200 అడుగుల రహదారి నిర్మాణం వల్ల ప్రభావితమయ్యే ఆస్తులను అధికారులు పరిశీలించినట్లు తెలిపారు. ప్రజలకు, ఆస్తుల యజమానులకు ఇబ్బందులు తగ్గించే ఉద్దేశంతో ప్రతిపాదిత రహదారి వెడల్పును 200 అడుగుల నుంచి 160 అడుగులకు తగ్గించే సాధ్యాసాధ్యాలపై చర్చించినట్లు వెల్లడించారు.

సవరించిన రహదారి అలైన్మెంట్ ప్రకారం టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాల అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించాలని, రహదారి విస్తరణ వల్ల ప్రభావితమయ్యే ఆస్తుల యజమానులకు నవంబర్ 15, 2026లోపు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రతిపాదిత మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేసేందుకు వెహిక్యులర్ అండర్పాస్ (VUP) వరకు భూసేకరణ ప్రక్రియను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టు అమలులో జాప్యం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఫ్లైఓవర్, అండర్పాస్ నిర్మాణం, రోడ్డు విస్తరణ కారణంగా ఇళ్లు, ఆస్తులు కోల్పోయే బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని గాంధీ భరోసా ఇచ్చారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. బాధితులకు ఆమోదయోగ్యమైన నష్టపరిహారం అందించేలా ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్తానని, అర్హులైన ప్రతి ఒక్కరికీ టీడీఆర్ (TDR) అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. స్థానికుల అభిప్రాయాలను, వారి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటూ అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో మియాపూర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు.
రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీతో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకే ఈ ఫ్లైఓవర్, అండర్పాస్ నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ కష్టాలు తగ్గడంతోపాటు ప్రయాణ సమయం, ఇంధనం ఆదా అవుతాయని, ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుందని వివరించారు. అభివృద్ధి పనులకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సిఎంసీ కమిషనర్ సృజన, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ మలెంపాటి, డీసీలు శ్రీనివాస్, బాలకృష్ణ, సీసీపీ వెంకన్న, ప్రాజెక్ట్స్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు సీఈ శ్రీలక్ష్మి, ఈఈ గోపాల్, డీఈ వరుణ్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సుష్మా, డీఈ శ్రీదేవి, ఏఈ ప్రతాప్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ వాసులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.





