శేరిలింగంపల్లి, అక్టోబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షాకాలంలో నీరు నిలిచిపోయి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రూ.98 లక్షల అంచనా వ్యయంతో 2,25,000 లీటర్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న నీటి నిల్వ సంపును ప్రభుత్వ పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. వర్షాకాలంలో రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో నీటి నిల్వ సంపు నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. సంపు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే వర్షపు నీటి నిల్వ సమస్య తగ్గడంతోపాటు పాపిరెడ్డి కాలనీ, హుడా కాలనీ ప్రాంతాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయని చెప్పారు. ప్రయాణికులకు ఉపశమనం లభించడంతోపాటు ప్రయాణ సమయం, ఇంధనం ఆదా అవుతాయని వివరించారు.
సంపు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను గాంధీ ఆదేశించారు. పనుల్లో వేగం పెంచడంతోపాటు నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.





