శేరిలింగంపల్లి, అక్టోబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు యువత అంకితభావంతో కృషి చేయాలని బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మహారాష్ట్ర యువ సంవాద్ ఇన్‌చార్జి కసిరెడ్డి సింధూరెడ్డి పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని ధూలే నగరంలో ఆదివారం ఉదయం యువ సంవాద్ పేరుతో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొని యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా సింధూరెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా యువత ముందుకు సాగాలని సూచించారు. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ దేశ పురోగతికి తమ వంతు సహకారం అందించాలని కోరారు.

సామాజిక మాధ్యమాల్లో సమాచారం షేర్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని ఆమె సూచించారు. అవాస్తవాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా జాగ్రత్త వహించాలని, బాధ్యతాయుతంగా సోషల్ మీడియాను వినియోగించాలని యువతకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వేలాది మంది యువత వీక్షించారు.






