చందానగర్‌లో ఘనంగా అన్నదాన కార్యక్రమం

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని చందానగర్ బస్టాండ్ సమీపంలో శ్రీ వాసవీ అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 700 మందికి అన్నదానం చేశారు. సమాజ సేవే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు, కుటుంబ సభ్యులు, యువకులు, స్వచ్ఛంద సేవకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సేవకులు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించి భక్తులకు, అవసరమైన వారికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చందానగర్ మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఆమె భాగస్వామ్యం పట్ల సమితి సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నెల అన్నదాన కార్యక్రమ నిర్వహణకు దాతలు, వారి కుటుంబ సభ్యులు ముందుకొచ్చి సహకరించారు. వారి సేవా దృక్పథాన్ని సమితి సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అనే స్ఫూర్తితో నిరుపేదలకు, అవసరంలో ఉన్నవారికి అన్న ప్రసాదాన్ని అందించడం ఎంతో సంతృప్తినిస్తోందని తెలిపారు. ప్రతి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని సంకల్పించినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో నిర్వహించే సేవా కార్యక్రమాల్లో మరింత మంది ఆర్యవైశ్య కుటుంబాలు, దాతలు, యువత, శ్రేయోభిలాషులు భాగస్వాములు కావాలని సమితి సభ్యులు కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దాతలు, అతిథులు, స్వచ్ఛంద సేవకులు, సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మన ఐక్యతే మన బలం – మన సేవే మన గుర్తింపు అనే నినాదంతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని శ్రీ వాసవీ అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here