శేరిలింగంపల్లి, అక్టోబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారంలో జాతీయ రహదారి (NH-65) విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులతో PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చర్చించారు. R&B అధికారులు DE సందీప్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, గ్రామ పెద్దలతో కలిసి బాధితుల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. రహదారి విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులు ఎవరూ అధైర్యపడవద్దని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, ఆమోదయోగ్యమైన నష్టపరిహారం అందేలా ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్తామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ TDR అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రాంతంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని NH-65 విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నట్లు గాంధీ తెలిపారు. ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రజల ప్రయాణ సమయం, ఇంధన వ్యయం ఆదా అవుతాయని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, బాధితులకు ఆమోదయోగ్యమైన విధానంలో రహదారి విస్తరణ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గంగారం గ్రామ పెద్దలు, స్థానికులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.





