బాలాజీ జ్యువెల్లరీ చోరీ కేసు ఛేధ‌న‌.. నలుగురు అరెస్ట్

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమి నగర్‌లో బాలాజీ జ్యువెల్లర్స్‌లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, చోరీకి గురైన బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీ బాలాజీ జ్యువెల్లర్స్ యజమాని నూకల శివ శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆగస్టు 1న చందానగర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 829/2026 కింద BNS 331(4), 305 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. జూలై 31 అర్ధరాత్రి నుంచి ఆగస్టు 1 మధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు షాపు తాళాలు పగులగొట్టి, వెనుక గోడకు ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను తొలగించారు. అనంతరం గోడలోని రంధ్రాన్ని పెద్దదిగా చేసి షాపులోకి ప్రవేశించి, స్టోరేజ్ రూమ్ తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు.

కేసు దర్యాప్తులో భాగంగా చందానగర్ క్రైమ్ టీం, CCS బృందాలు సుమారు 500 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించారు. నిందితులు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లాయి. అయితే, మరో ఇంటి దొంగతనం కేసులో గ్వాలియర్ పోలీసులు చందానగర్ పోలీసుల కంటే సుమారు గంట ముందే నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం ప్రస్తుత కేసులో PT వారెంట్ల ద్వారా చందానగర్ పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితులను పోలీసులు గుర్తించారు. A1 ఛోటూ @ యోగేష్ మండేలియా (జాతవ్) (31), గ్లాస్ ఫిట్టింగ్ కార్మికుడు, గ్వాలియర్ జిల్లా, A2 గోలు @ రాజేష్ మండేలియా (35), గ్లాస్ ఫిట్టింగ్ కార్మికుడు, గ్వాలియర్ జిల్లా, A3 అతుల్ శర్మ (30), కథా గ్రామం, భింద్ జిల్లా, A4 శ్యామ్ సుందర్ కుష్వాహ్ (30), డ్రైవర్, గ్వాలియర్ గా తెలిపారు. పోలీస్ కస్టడీలో విచారించగా చోరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలను A3 అతుల్ శర్మకు చెందిన భింద్ జిల్లా కథా గ్రామంలోని నివాసంలో దాచినట్లు నిందితులు వెల్లడించారు.

వారి వెల్లడింపు మేరకు సెప్టెంబర్ 13న మధ్యవర్తుల సమక్షంలో A3 నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 59.220 గ్రాముల బరువున్న కరిగించిన బంగారు బార్, సుమారు 2 కిలోల వెండి పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. మరో కిలో వెండిని ఆశిష్ తోని అనే షాపు యజమానికి విక్రయించినట్లు నిందితులు వెల్లడించగా, అతని ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిందితులను గ్వాలియర్ నుంచి చందానగర్‌కు తీసుకువచ్చి సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. అనంతరం బుధవారం న్యాయస్థానం ముందు హాజరుపరచగా, నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ఆర్‌సీ పురం డివిజన్ ఏసీపీ సీహెచ్.వై. శ్రీనివాస్ కుమార్ పర్యవేక్షణలో చందానగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్లు ఎ. శ్రీధర్ కుమార్, కె. ప్రదీప్ కుమార్, డిటెక్టివ్ క్రైమ్ సిబ్బంది, CCS బృందం సమన్వయంతో కేసును ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో కృషి చేసిన పోలీసు సిబ్బందికి తగిన రివార్డు అందజేస్తామని ఏసీపీ తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here