శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు ఇబ్బందిగా మారిన 22ఏ భూముల సమస్యపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు టీడీపీ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ కట్టా వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కట్టా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. తాము 22ఏ నిబంధనకు వ్యతిరేకం కాదని, అయితే పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలను 22ఏ పరిధిలోకి తీసుకువచ్చి ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 22ఏ నుంచి భూములను తొలగిస్తూ వేల ఎకరాల భూములను ఆ పార్టీకి చెందిన కుటుంబ సభ్యులకు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. దేవుడి భూముల విషయంలోనూ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్న చిన్నచిన్న కాలనీ వాసులను, వ్యవసాయదారుల భూములను 22ఏ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తే మాత్రం ఊరుకునేది లేదని వెంకటేష్ గౌడ్ స్పష్టం చేశారు. పేదల భూములకు రక్షణ కల్పిస్తూ, సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామేశ్వరరావు, సుభాషిణి ఎమ్, రమేష్ బాబు, సవీందర్, కత్తి తమోదనరావు, కొత్త నరసింహ గౌడ్, శ్రవణ్, అప్పలనాయుడు ఎమ్, జయశ్రీ, జయమ్మ, సాంబశివరావు, రఘు రాజ్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రమేష్, ఆగిశెట్టి బాలరాజు, కొండల్ రెడ్డి, మహమ్మద్ ఆజాం, నాగేందర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.





