శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): మైనారిటీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన పథకం కింద శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన ఐదుగురు అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించారు. ఒక్కో లబ్ధిదారుకు రూ.50 వేల చొప్పున మొత్తం రూ.2.50 లక్షల విలువైన చెక్కులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన ద్వారా అందుతున్న ఆర్థిక సాయంతో మహిళలు చిన్నతరహా వ్యాపారాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడంతో పాటు మహిళలు స్వతంత్రంగా ఆదాయం పొందేందుకు ఈ పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు.

మైనారిటీ మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచి, వారి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, స్వయం ఉపాధి అవకాశాలను పెంచడం ప్రభుత్వ లక్ష్యమని గాంధీ తెలిపారు. ఇదే కార్యక్రమంలో తుర్క కాశా మైనారిటీ వర్గాలకు స్టోన్ కటింగ్ జనరేటర్లు, టూల్ కిట్లు పంపిణీ చేశారు. రాళ్ల కటింగ్ పనుల్లో గతంలో ఎక్కువ శ్రమ, సమయం వెచ్చించాల్సి వచ్చేదని గాంధీ తెలిపారు. జనరేటర్లు, టూల్ కిట్లతో సమయం ఆదా కావడంతో పాటు శ్రమ తగ్గి, తక్కువ సమయంలో ఎక్కువ పని చేసుకునే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. తద్వారా ఆదాయం పెరిగి ఆర్థికంగా బలోపేతం కావడానికి ఇవి ఉపయోగపడతాయని అన్నారు. రూ.50 వేల ఆర్థిక సాయం అందుకోవడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు ఆర్థికంగా అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, పోతుల రాజేందర్, కాశీనాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.





