మియాపూర్–బాచుపల్లి రహదారి విస్తరణ పనుల పరిశీలన

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ బొల్లారం చౌరస్తా నుంచి బాచుపల్లి వరకు చేపడుతున్న నూతన రోడ్డు విస్తరణ పనులను మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. మియాపూర్ ట్రాఫిక్ సీఐ బీఎన్‌ఎస్ రెడ్డితో కలిసి రహదారిపై నెలకొన్న ట్రాఫిక్ సమస్యలను పరిశీలించి, వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. బొల్లారం చౌరస్తా నుంచి బాచుపల్లి వరకు ప్రధాన రహదారిపై రోజురోజుకూ వాహనాల రద్దీ పెరుగుతోందన్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం స్కూల్ సమయాల్లో భారీగా ట్రాఫిక్ ఏర్పడడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

స్కూల్ సమయాల్లో ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ట్రాఫిక్ అధికారులను కోరారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేయడంతోపాటు విద్యార్థులు రహదారి దాటే ప్రాంతాల్లో తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యకు కొంతమేర పరిష్కారం లభించే అవకాశం ఉందని శ్రీకాంత్ తెలిపారు. అయితే పనులు పూర్తయ్యే వరకు ప్రజలు, వాహనదారులు, ముఖ్యంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. రోడ్డు విస్తరణ పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని, పనులు కొనసాగుతున్న సమయంలో పాదచారులు, వాహనదారులు, విద్యార్థులకు సురక్షితమైన రాకపోకలు ఉండేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యలతో పాటు విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశాలపై అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తానని శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వాసు, కప్పెర రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here