శేరిలింగంపల్లి, ఆగస్టు 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచనలతో వివిధ డివిజన్లలో ఈ ఆందోళనలు చేపట్టారు. శేరిలింగంపల్లి డివిజన్ పాపిరెడ్డినగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద, కొండాపూర్ డివిజన్ కార్యాలయం పరిధిలోని పెట్ బ్రిడ్జి ప్రేమ్‌నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద, చందానగర్, హఫీజ్‌పేట్ డివిజన్లకు సంబంధించి పీజేఆర్ స్టేడియం వద్ద గాంధీ విగ్రహం దగ్గర, మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలు నిర్వహించారు.

మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ నవత రెడ్డి, సీనియర్ నాయకులు మారబోయిన రవి యాదవ్, విజయ రెడ్డి, అల్లావుద్దీన్ పటేల్, సంతోష్, మమత, శ్రీకాంత్, మల్లారెడ్డి, రామకృష్ణ, సంగారెడ్డి, నరేందర్ యాదవ్, కార్తీక్, రోజా, కిరణ్ యాదవ్, శ్రీనివాస్, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవరం రంగారావు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. వివాహ సమయంలో పేద కుటుంబాలకు అండగా నిలిచే ఈ పథకాలను రాజకీయ కక్షతో నిర్వీర్యం చేయడం సరికాదన్నారు.

అలాగే మహిళలకు అందించే కేసీఆర్ కిట్‌ను పునరుద్ధరించాలని, ఆడపిల్ల పుడితే రూ.14 వేలు, మగపిల్లవాడు పుడితే రూ.13 వేలు అందించే ఆర్థిక సాయాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత మూడేళ్లుగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం లేదని, ఈసారి ప్రతి మహిళకు బతుకమ్మ చీరలు అందించాలని కోరారు. ఒంటరి మహిళా పెన్షన్లు, ఆసరా పింఛన్లను కొత్తగా మంజూరు చేయడంతోపాటు ఇప్పటికే పొందుతున్న పలువురికి నిలిపివేసిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని రంగారావు ఆరోపించారు. పెళ్లి చేసుకునే పేదింటి ఆడబిడ్డలకు ప్రభుత్వం అండగా ఉండాల్సిన సమయంలో పథకాలను నిలిపివేయడంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.
కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల కింద పెండింగ్‌లో ఉన్న చెక్కులు, ఆర్థిక సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి జాప్యం లేకుండా పథకం ప్రయోజనం అందించాలని కోరారు. పేద ప్రజల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని రంగారావు హెచ్చరించారు. అవసరమైతే మహిళలతో కలిసి ఎమ్మెల్యేలు, సీఎం కార్యాలయం, అసెంబ్లీని ముట్టడించే స్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రకటించారు.





