శేరిలింగంపల్లి, ఆగస్టు 17 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ నగరం నడిబొడ్డున ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు రంగం సిద్ధమైంది. ఆగస్టు 18న సాయంత్రం 4 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా గౌడ జన హక్కుల పోరాట సమితి నాయకులు, గౌడ సంఘాల ప్రతినిధులు, పాపన్న గౌడ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌ను అణగారిన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని పోరాడిన విప్లవ వీరుడిగా, సామాజిక న్యాయం కోసం కృషి చేసిన ధీరుడిగా గౌడ సంఘాల నాయకులు అభివర్ణించారు. వివిధ కులాలు, వర్గాలను తన పోరాటంలో భాగస్వామ్యం చేసుకుని సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహాయోధుడిగా పాపన్న చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు.

ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో 2003 జూన్ 25న హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గౌడ జన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించినట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. ఆ సభలో మాజీ ఎంపీ ధర్మభిక్షం, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, గౌడ పెద్దలు, మేధావులు పాల్గొన్నారని గుర్తుచేశారు. లండన్ మ్యూజియంలో పాపన్న విగ్రహాన్ని చూసి, అనంతరం తన స్వగ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్‌చాన్సలర్ పేర్వారం జగన్నాథం కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచారని తెలిపారు. ఆ రోజు ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉద్యమం ప్రారంభమైందని, నేటికి 23 ఏళ్ల తర్వాత ఆ కల సాకారం అవుతోందని పేర్కొన్నారు.

2003లో జరిగిన సభలో పంజాల జైహింద్ గౌడ్ భువనగిరిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం విజయవాడలో విగ్రహాన్ని తయారు చేయించి భువనగిరికి తీసుకొచ్చారని వివరించారు. హైదరాబాద్-విజయవాడ హైవే, చౌరస్తా తదితర ప్రాంతాల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వచ్చినప్పటికీ, పాపన్న పాలించిన భువనగిరి కోటపైనే విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పురావస్తు శాఖ పరిధిలో ఉన్న కోటపై అనుమతులు సాధించడం సవాలుగా ఉన్నప్పటికీ, చివరకు 2023 ఆగస్టు 18న భువనగిరి కోటపై పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఘనంగా జరిగిందని పేర్కొన్నారు. ఆ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించి సుమారు 10 వేల మంది గౌడ ముస్తాదులు, వస్తాదులను సమీకరించినట్లు తెలిపారు. అదే సందర్భంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితంపై సినిమా నిర్మాణానికి సంబంధించిన షూటింగ్‌ను నటుడు సుమన్ తదితరులతో ప్రారంభించినట్లు గుర్తుచేశారు.
పాపన్న గౌడ్ చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్యమం కారణంగా అనంతరం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహాల ఏర్పాటుకు చైతన్యం పెరిగిందని గౌడ సంఘాల నాయకులు తెలిపారు. పల్లెల నుంచి పట్టణాల వరకు వేలాది విగ్రహాలు ఏర్పాటు చేయడం ద్వారా పాపన్న చరిత్రను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. జమీందారులు, జగీర్ధారులు, పటేల్, పట్వారీ వ్యవస్థలతోపాటు మొఘల్ పాలకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పాపన్న గెరిల్లా పోరాటం సాగించారని వారు గుర్తుచేశారు. వెట్టి చాకిరీ, కట్టు బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడిగా ఆయనకు ప్రజలే సర్దార్ అనే బిరుదు ఇచ్చారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించడంలో అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. తొలి తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్, కొంపల్లి వెంకట్ గౌడ్, నాసగోని రాజయ్య గౌడ్, వట్టికూటి రామారావు గౌడ్, అంబాల నారాయణ గౌడ్, బాలగోని బాలరాజ్ గౌడ్, ఎంవీ రమణ తదితరులు పాపన్న స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడంలో కృషి చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోస్టల్ స్టాంపును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆవిష్కరించడం కూడా గౌడ సమాజానికి ముఖ్యమైన పరిణామమని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై పాపన్న గౌడ్ విగ్రహ నిర్మాణం పూర్తికావడం చారిత్రాత్మక పరిణామమని తెలిపారు. గత ఏడాది భూమిపూజ చేసి ఏడాది వ్యవధిలో విగ్రహ నిర్మాణం పూర్తిచేయడం విశేషమన్నారు.
23 ఏళ్ల క్రితం కన్న కల.. నేడు ట్యాంక్‌బండ్‌పై సాకారం అవుతోందని, ఇది తమ దృఢ సంకల్పానికి నిదర్శనమని గౌడ జన హక్కుల పోరాట సమితి నాయకులు పేర్కొన్నారు. ఆగస్టు 18న జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.





