భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో పాటు విశాఖ విమానాశ్రయం కొనసాగించాలి.. రాష్ట్రపతికి వినతి

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన అనంతరం కూడా విశాఖపట్నం విమానాశ్రయం సేవలను కొనసాగించాలని కోరుతూ భారత రాష్ట్రపతికి నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ జాతీయ అధ్యక్షుడు గురుదేవ్జీ నెల్లి వినతిపత్రం సమర్పించారు. విశాఖపట్నం విమానాశ్రయాన్ని పూర్తిగా మూసివేయకుండా దేశీయ, ఎంపిక చేసిన ప్రాంతీయ విమాన సర్వీసులను కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్రపతిని కోరారు. దేశంలోని పలు మహానగరాల్లో ఒకటి కంటే ఎక్కువ విమానాశ్రయాలు సమాంతరంగా విజయవంతంగా పనిచేస్తున్నాయని, అదే విధంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నానికి కూడా ప్రస్తుత విమానాశ్రయ సేవలు కొనసాగడం అవసరమని పేర్కొన్నారు.

విశాఖపట్నం ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్య, విద్యా, వైద్య, రక్షణ, పోర్టు, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రెండు విమానాశ్రయాలు సమాంతరంగా పనిచేస్తే రాష్ట్ర అభివృద్ధికి మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. విమానాశ్రయం మూసివేస్తే ప్రయాణికులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, రోగులు, పర్యాటకులు, రక్షణ రంగ సిబ్బంది, స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు విశాఖపట్నం విమానాశ్రయాన్ని కొనసాగించడం ద్వారా ఉపాధి అవకాశాలు, పర్యాటకం, పెట్టుబడులు, ప్రజా రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడే అవకాశం ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు.

భారత ప్రభుత్వం, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (AAI) తదితర సంబంధిత అధికారులు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెండు విమానాశ్రయాల సేవలను కొనసాగించేలా సమతుల్య విమానయాన విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించి తగిన ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్రపతిని గురుదేవ్జీ నెల్లి కోరారు. వినతిపత్రం ప్రతులను భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రికి పంపినట్లు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here