శేరిలింగంపల్లి, ఆగస్టు 16 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 201 మంది మందుబాబులు పట్టుబడ్డారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి, వారిని న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టుబడిన వారిలో 174 మంది ద్విచక్ర వాహనదారులు, 9 మంది త్రిచక్ర వాహనదారులు, 17 మంది నాలుగు చక్రాల వాహనదారులు, ఒకరు హెవీ వెహికల్ డ్రైవర్ ఉన్నారు.

పట్టుబడిన 201 మందిని వారి రక్తంలో ఆల్కహాల్ స్థాయి (BAC) ఆధారంగా మూడు విభాగాలుగా గుర్తించారు. 170 మందిలో 36 mg/100 ml నుంచి 200 mg/100 ml వరకు, 16 మందిలో 201 mg/100 ml నుంచి 300 mg/100 ml వరకు, మరో 15 మందిలో 301 mg/100 ml నుంచి 550 mg/100 ml వరకు ఆల్కహాల్ స్థాయిలు నమోదయ్యాయి. పట్టుబడిన వారందరినీ న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమై ప్రాణనష్టం జరిగితే, అలాంటి వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్ 105 కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ సెక్షన్ కింద గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.
కాగా ఆగస్టు 10 నుంచి 15 వరకు గత వారంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌కు సంబంధించిన 276 కేసులను న్యాయస్థానాలు పరిష్కరించాయి. ఇందులో 3 మందికి జరిమానాతోపాటు జైలు శిక్ష, 9 మందికి జరిమానాతో పాటు సామాజిక సేవ, 264 మందికి జరిమానా మాత్రమే విధించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు, విస్తృత అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.





