సాయి వైభవ్ కాలనీలో రూ.2.90 కోట్లతో పార్క్ అభివృద్ధి

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సాయి వైభవ్ కాలనీలో రూ.2 కోట్ల 90 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పార్క్ అభివృద్ధి, సుందరీకరణ పనులకు PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. సాయి వైభవ్ కాలనీలో భారీ వ్యయంతో పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. కాలనీ పచ్చని చెట్లతో కళకళలాడుతూ, పచ్చదనంలో ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు.

మొక్కలు మానవాళి మనుగడకు శ్రీరామరక్ష వంటివని పేర్కొన్న గాంధీ.. మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, పార్క్ ఆవరణలోనూ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని సూచించారు. పార్క్‌ను సుందర శోభిత వనంగా తీర్చిదిద్దుతామని ఆరెకపూడి గాంధీ తెలిపారు. ఆరోగ్య శేరిలింగంపల్లి త‌న‌ ధ్యేయం అని పేర్కొంటూ.. నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పార్కులతోపాటు ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేసి ప్రజలు ప్రతిరోజూ వ్యాయామం చేసుకునేలా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. పార్కులు వృద్ధులు, పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంతోపాటు ప్రజల ఆరోగ్యానికి దోహదపడతాయని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామిగా నిలబెడతామని గాంధీ అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని, చేపట్టే అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన ప్రయాణానికి అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని గాంధీ పునరుద్ఘాటించారు.

సాయి వైభవ్ కాలనీలో రూ.2 కోట్ల 90 లక్షల అంచనా వ్యయంతో పార్క్ అభివృద్ధి, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసినట్లు గాంధీ తెలిపారు. గచ్చిబౌలి డివిజన్‌తోపాటు శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here