శేరిలింగంపల్లి, ఆగస్టు 16 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీశ్రీ శారదాపీఠం ఆధ్వర్యంలో చందానగర్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీశక్తి సనాతన శక్తి కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శారదాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, శ్రీశ్రీశ్రీ స్వాత్మానంద స్వామి ఆశీస్సులను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పొందారు.

అనంతరం శేరిలింగంపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మిరియాల రాఘవరావు, మిరియాల ప్రీతమ్ కుటుంబ సమేతంగా గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శివ ప్రతాప్ శుక్లాను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సనాతన ధర్మ పరిరక్షణ, ఆధ్యాత్మిక విలువలు, ధర్మాచరణ తదితర అంశాలపై ప్రముఖులు చర్చించారు. సనాతన ధర్మ విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు పాల్గొనగా, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.





