శేరిలింగంపల్లి, ఆగస్టు 5 (నమస్తే శేరిలింగంపల్లి): సైబర్ జాగృత దివస్ సందర్భంగా మియాపూర్ పోలీసులు సురక్షా కా తిరంగా కార్యక్రమంలో భాగంగా మియాపూర్‌లోని వి.ఆర్. రెడ్డి ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో సైబర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ విద్యార్థినులకు పెరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. లోన్ యాప్ మోసాలు, ఆన్లైన్ బెట్టింగ్, పెట్టుబడి మోసాలు, క్రెడిట్, డెబిట్ కార్డు మోసాలు, యూపీఐ, ఓటీపీ మోసాలు, ఫిషింగ్ దాడులు, ఇతర ఆన్లైన్ ఆర్థిక నేరాల గురించి వివరించారు.

వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను గోప్యంగా ఉంచుకోవడం, ఆన్లైన్ లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండడం, అనుమానాస్పద లింకులు, కాల్స్, మెసేజ్‌లకు స్పందించకూడదని సూచించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ కు ఫోన్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు. బాధ్యతాయుతమైన, సైబర్ భద్రతపై అవగాహన కలిగిన డిజిటల్ పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పోలీసులు పేర్కొన్నారు.






