శేరిలింగంపల్లి, ఆగస్టు 5 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ జంక్షన్‌లో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతా చర్యలను డీసీపీ ట్రాఫిక్–II శేషాద్రిని రెడ్డి పరిశీలించారు. బుధవారం మియాపూర్ ట్రాఫిక్ డివిజన్ ఏసీపీతో కలిసి జంక్షన్‌ను సందర్శించి, పాదచారులు, వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీసీపీ శేషాద్రిని రెడ్డి పాదచారులతో నేరుగా మాట్లాడి, జీబ్రా క్రాసింగ్, పాదచారుల సిగ్నల్, ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ రహదారిని దాటాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల సంభవించే రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టం వంటి తీవ్ర పరిణామాలపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కోరారు.

అనంతరం మియాపూర్ జంక్షన్‌లో కొనసాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన ముందస్తు పనులను, ట్రాఫిక్ నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన అదనపు లేన్ ట్రయల్ రన్‌ను పరిశీలించారు. నిర్మాణ పనుల కారణంగా ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అల్విన్ జంక్షన్‌లోని ఫ్రీ లెఫ్ట్ సౌకర్యాన్ని కూడా పరిశీలించిన డీసీపీ, వాహనదారులకు స్పష్టమైన అవగాహన కల్పించేలా Free Left Ahead, Free Left – Fine for Violation హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు.
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ఫ్రీ లెఫ్ట్ మార్గాలను అడ్డుకునే వాహనదారులపై మోటార్ వెహికిల్స్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేసి నేరుగా వెళ్లేందుకు ప్రయత్నించే వాహనాలను అనుమతించకుండా, ఫ్రీ లెఫ్ట్ మార్గం ద్వారానే వెళ్లి తదుపరి యూ-టర్న్ వరకు ప్రయాణించేలా ట్రాఫిక్‌ను నియంత్రించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ క్రమశిక్షణ, ప్రజల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా ట్రాఫిక్ నిర్వహణ చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.





