శేరిలింగంపల్లి, ఆగస్టు 5 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజల స్వాభిమానం, ధైర్యం, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి చిరస్మరణీయ ప్రతీకగా నిలిచిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు. రాయదుర్గం గ్రామంలో గౌడ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ నాయకుడు మధుయాష్కి గౌడ్, మాజీ ఎంపీ బుర్ర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, అశోక్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అధికారాన్ని అనుభవించేందుకు కాకుండా ప్రజల హక్కులను కాపాడేందుకు పోరాడిన మహానాయకుడని అన్నారు. అన్యాయాన్ని ఎదిరించి, అణచివేతకు వ్యతిరేకంగా నిలబడి, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి తెలంగాణ బిడ్డకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చరిత్రను గౌరవిస్తూ, మరుగునపడిన మహనీయులకు తగిన గుర్తింపు కల్పించే దిశగా పలు చారిత్రక కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. మహనీయుల జయంతులు, వర్ధంతులను అధికారికంగా నిర్వహించడం, వారి చరిత్రను భావితరాలకు చేరవేయడం ద్వారా ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించే ప్రయత్నం జరుగుతోందని వివరించారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వం పాలనలో ప్రధాన లక్ష్యాలుగా తీసుకుని ముందుకు సాగుతోందని, ఇదే స్ఫూర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటంలోనూ కనిపిస్తుందని అన్నారు. ఆయన ఆశయాలు నేటి తెలంగాణ నిర్మాణానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం కేవలం ఒక శిల్పం కాదని, అది ధైర్యానికి ప్రతీక, స్వాభిమానానికి చిరునామా, సామాజిక న్యాయానికి చిహ్నమని జగదీశ్వర్ గౌడ్ అన్నారు. భావితరాలు ఆయన చరిత్రను తెలుసుకుని సమాజ సేవలో ముందుండే నాయకత్వాన్ని అలవర్చుకోవాలని, పాపన్న ఆశయాలను ఆచరిస్తూ తెలంగాణను మరింత అభివృద్ధి, సమానత్వం, సామాజిక న్యాయం వైపు తీసుకెళ్లేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ లేబర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్ల సంజీవ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాములు గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, భరత్ గౌడ్, వెంకటేష్ గౌడ్, కనకమామిడి నరేందర్ గౌడ్, సురేష్ గౌడ్, చిన్న గౌడ్, వీరేందర్ గౌడ్, రోహిత్ గౌడ్, శ్రీకాంత్ ముదిరాజ్, మల్లికార్జున్ యాదవ్, అనిల్ గౌడ్, ఏకాంత్ గౌడ్, పుట్ట వినయ్ కుమార్ గౌడ్, అశోక్ యాదవ్, కృష్ణ యాదవ్‌తో పాటు బీసీ సంఘాల నాయకులు, గౌడ్ సంఘం రాష్ట్ర, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.





