శేరిలింగంపల్లి, ఆగస్టు 5 (నమస్తే శేరిలింగంపల్లి): ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనపై తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆధ్వర్యంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ)లో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో సీఎంసీ కమిషనర్ సృజన, అన్ని జోన్ల కమిషనర్లు, వివిధ శాఖల విభాగాధిపతులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక సబ్‌ప్లాన్ నిధులతో కాలనీల అభివృద్ధి, శ్మశాన వాటికలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అప్రోచ్ రోడ్ల నిర్మాణం, మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల అభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే వీధి వ్యాపారులకు సహాయం, పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, బీమా సదుపాయం, శాశ్వత, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఆరోగ్య బీమా, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఉపాధి అవకాశాల కల్పన, ఎస్సీ, ఎస్టీ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు.

అదేవిధంగా అభివృద్ధి పనులు, టెండర్లలో రిజర్వేషన్ నిబంధనల అమలు, బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీ, రోస్టర్ విధానం, ఆర్థిక కేటాయింపుల అమలు వంటి అంశాలను అధికారులు పరిశీలించారు. సంబంధిత నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు శాఖల మధ్య సమన్వయం, పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని సమావేశంలో సూచించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు అర్హులైన లబ్ధిదారులకు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులకు సూచించారు. సమావేశంలో చర్చించిన అంశాలపై సంబంధిత శాఖలు సమన్వయంతో తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.





