శేరిలింగంపల్లి, ఆగస్టు 2 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో ఆదివారం నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రముఖ కూచిపూడి నాట్య గురువు అనూష శ్రీనివాస్ శిష్య బృందం సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సందర్భంగా మూషిక వాహన, వినాయక కౌతం, రారవెను, హంసానందిని జతిస్వరం, కులుకాగా నడవరో, సాంబశివ, వరవీణ, తరంగం, తిల్లాన తదితర అంశాలను విద్యార్థినులు అద్భుతంగా ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు.

ఈ ప్రదర్శనలో మాన్య, శ్రీలాస్య, కింసిక, హసిత, జస్మితా, లలిత, ధనశ్రీ, మమతా, శ్రావ్య, హారిక, రేష్మ, హిమ భార్గవి తదితరులు తమ నృత్య ప్రతిభను చాటారు. కార్యక్రమానికి ప్రముఖ నాట్య గురువు, సంగీత విద్వాంసుడు డి.ఎస్.వి. శాస్త్రి, పి.బి. భారతి, అన్నా రావు, మధు శాస్త్రి ముఖ్య అతిథులుగా హాజరై కళాకారులను అభినందించారు. కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని యువతకు చేరువ చేస్తున్న గురువులు, విద్యార్థుల కృషిని వారు కొనియాడారు.





