శేరిలింగంపల్లి, ఆగస్టు 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బలరామ్ యాదవ్ ఆధ్వర్యంలో కాలనీ ప్రతినిధులు కలిసి పలు స్థానిక సమస్యలను వినిపించారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యతోపాటు అమ్మవారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, వాటర్ వర్క్స్ మేనేజర్ సందీప్ తో ఫోన్లో మాట్లాడి ప్రతిరోజూ ఉదయం వేళల్లో నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని, అలాగే నీటి విడుదల సమయాన్ని కొంత పెంచాలని ఆదేశించారు.

అదేవిధంగా అమ్మవారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన అంశంపై త్వరలో ప్రత్యేకంగా సమావేశమై సమగ్రంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమతో కలిసి వచ్చి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బలరామ్ యాదవ్ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.





