శేరిలింగంపల్లి, ఆగస్టు 1 (నమస్తే శేరిలింగంపల్లి): అంతర్జాతీయ ఫ్రెండ్స్ డే సందర్భంగా హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని ఎస్‌ఎల్‌వీ ప్రో బ్యాడ్మింటన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీలు క్రీడా ఉత్సాహంతో సాగాయి. స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్నేహబంధాన్ని చాటుతూ హోరాహోరీగా తలపడ్డారు.

ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోటీల్లో నరహరి-నరేష్ జోడీ అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. విష్ణు యాదవ్-అజయ్ చింతల జోడీ ద్వితీయ స్థానాన్ని దక్కించుకోగా, సురేందర్ అండ్ టీం తృతీయ స్థానంలో నిలిచింది. చందు-బ్రహ్మరెడ్డి జోడీ చతుర్థ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, యువతలో ఆరోగ్యకరమైన పోటీతత్వంతో పాటు స్నేహస్ఫూర్తిని పెంపొందించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అనంతరం విజేతలకు ట్రోఫీలు, బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, క్రీడాభిమానులు, స్థానిక ప్రముఖులు పాల్గొని విజేతలను అభినందించారు.






