శేరిలింగంపల్లి, జూలై 30 (నమస్తే శేరిలింగంపల్లి): ఆపరేషన్ ముస్కాన్ 12 కార్యక్రమంలో భాగంగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిక్షాటన చేస్తూ కనిపించిన ఓ బాలుడిని పోలీసులు రక్షించి, అతని తల్లిదండ్రులను గుర్తించి సురక్షితంగా అప్పగించారు. జూలై 28న మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న బాలుడిని పోలీసులు, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు సంయుక్తంగా గుర్తించి రక్షించారు. అనంతరం రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందించారు.

ఆపరేషన్ ముస్కాన్ 12 బృందం బాలుడితో పలుమార్లు మాట్లాడినా కుటుంబానికి సంబంధించిన వివరాలు తెలియకపోవడంతో తాత్కాలికంగా ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఆశ్రయం కల్పించారు. అనంతరం వివిధ పోలీస్ స్టేషన్లలో ఆరా తీయగా, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అల్లాపూర్ పోలీస్ స్టేషన్లో జూలై 26న నమోదైన మిస్సింగ్ కేసులో ఈ బాలుడే ఉన్నాడని గుర్తించారు. దీంతో బాలుడి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి, చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి, వారి సమక్షంలో బాలుడిని సురక్షితంగా అప్పగించారు. తమ కుమారుడిని క్షేమంగా అప్పగించినందుకు తల్లిదండ్రులు ఆపరేషన్ ముస్కాన్ 12 బృందానికి, మియాపూర్, అల్లాపూర్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మియాపూర్ పోలీసులు, జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు శ్రవణ్ కుమార్, దేవేంద్ర చారి, ఏహెచ్టీయూ సిబ్బంది షారూఖ్, విజయ్ భాస్కర్ రెడ్డి, మోతీలాల్, అనిల్ కుమార్, జహీదా తదితరులు, ఆపరేషన్ ముస్కాన్ 12 బృంద సభ్యులు పాల్గొన్నారు.





