శేరిలింగంపల్లి, జూలై 28 (నమస్తే శేరిలింగంపల్లి): భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఏర్పడిన కొండాపూర్, అంజయ్యనగర్ డివిజన్లలో కొనసాగుతున్న ఎన్యుమరేషన్ ప్రక్రియను కొండాపూర్ మాజీ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ఎన్యుమరేషన్ కేంద్రాలను సందర్శించిన హమీద్ పటేల్, బూత్ లెవల్ ఆఫీసర్లతో (BLOలు) మాట్లాడి కార్యక్రమం పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, ఓటర్ల వివరాల సేకరణ, ప్రజలతో సమన్వయం వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రతి ఇంటి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, ఎలాంటి అయోమయాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

వివిధ పోలింగ్ స్టేషన్లలో ఇప్పటివరకు సేకరించిన ఫారాల సంఖ్య, పెండింగ్లో ఉన్న ఇళ్ల వివరాలను సమీక్షించిన ఆయన, నిర్దేశిత గడువులోగా 100 శాతం కవరేజ్ సాధించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. సేకరించిన దరఖాస్తులను అదే రోజు డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, ఎలాంటి జాప్యం లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని బీఎల్ఓలు, సూపర్వైజర్లకు సూచించారు. భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా పాల్గొని ఓటరు జాబితా నవీకరణకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అలసత్వం వీడి ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.
ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, సరైన వివరాలతో ఓటరు జాబితా సిద్ధమైతే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని హమీద్ పటేల్ అన్నారు. ఇంటింటికి వచ్చే బూత్ లెవల్ ఆఫీసర్లకు అవసరమైన సమాచారం, పత్రాలు అందించి సహకరించాలని, పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాల్లో మార్పులు ఉంటే ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం ద్వారా సరిచేసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న SIR కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.





