శేరిలింగంపల్లి, అక్టోబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోనల్ స్థాయిలో ఆయా శాఖలతో సమన్వయ సమావేశం జోనల్ కమీషనర్ ఉపేందర్‌రెడ్డి అధ్యక్షతన గురువారం జోనల్ కార్యాలయంలో జరిగింది. సమన్వయ సమావేశంలో పోలీసు, ట్రాఫిక్, ఇంజినీరింగ్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, రెవిన్యూ, విద్యుత్, బయోడైవర్సిటీ, పట్టణ ప్రణాళిక, ఎస్ఆర్‌డీపీ, జలమండలి, హెచ్‌ఆర్‌డీసీఎల్,హెల్త్, పారిశుద్ధ్యం సహా పలు విభాగాధిపతులు పాల్గొన్నారు. ఈ సమన్వయ సమావేశానికి పీఏసీ ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి పలు విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. నానాటికీ పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, వాహనాల వినియోగం, ప్రజా సౌకర్యాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మరింత పకడ్బందీగా కృషి చేయటం ద్వారా మరిన్ని సత్ఫలితాలు నమోదవుతాయన్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు నివసించే ప్రాంతంగా ఐటీ పరిశ్రమలకు వేదికగా ఉన్నందున సమస్యలను వేగంగా పరిష్కరించి అభివృద్ధి పనులను మరింతగా వేగవంతం చేయాలన్నారు. రహదారుల విస్తరణ, కూడళ్ల అభివృద్ధి, డైనేజీ సమస్యలు, రహదారులపై గుంతలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని, సమన్వయం లోపిస్తే ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. ప్రధాన రహదారులపై ఉన్న ఫుట్ పాత్‌ల ఆక్రమణలను తొలగించాలని, పాదచారుల భద్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని, చెరువుల సుందరీకరణ, పార్కుల అభివృదిని చేపట్టాలని సూచించారు. గంగారం హనుమాన్ దేవాలయం నుంచి అపర్ణ వరకు వంద ఫీట్ల రోడ్డు, శ్రీదేవీ థియేటర్ రహదారి విస్తరణ సహా లింక్ రహదారుల నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు.
అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల మంజూరు కోసం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళతామని, అభివృద్ధే ప్రధాన అజెండాగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. జోనల్ కమీషనర్ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ రహదారుల విస్తరణకు ఆటంకంగా ఉన్న విద్యుత్ స్తంబాల మార్పును వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి గాను జంక్షన్‌లను మరింతగా విస్తరించాలని, ఉపయోగంలో లేని, ట్రాఫిక్‌కు ఆటంకంగా ఉన్న బస్సు షెల్టర్లను తొలగించనున్నామన్నారు. ఈ సమావేశంలో పలు విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.