శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): సీపీఐ( ఎం) శేరిలింగంపల్లి జోన్ కమిటీ ఆధ్వర్యంలో చందానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం) శేరిలింగంపల్లి జోన్ సెక్రెటరీ సి.శోభన్ మాట్లాడుతూ సీతారాం ఏచూరి మరణం తమను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. ఆయన మరణం భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని అన్నారు. విద్యార్థి దశ నుండి కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి వరకు ప్రజల తరపున నిలబడి ఉద్యమాలు చేశారని అన్నారు.ఎన్ని కష్టాలు వచ్చినా ఎర్రజెండాను వీడకుండా చివరికంటూ నిలబడిన గొప్ప త్యాగమూర్తి అని అన్నారు.
పార్లమెంట్ లో ప్రజా సమస్యలు లేవ నెత్తి ప్రజా వాణి వినిపించిన మహా నేత అని కొనియాడారు. కమ్యూనిస్టులే కాకుండా మిగిలిన పార్టీల నాయకులు కూడా సైద్ధాంతిక విభేదాలు ఉన్నా కూడా సీతారాం ఏచూరితో సత్సంబంధాలు కొనసాగించారని తెలిపారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలందరినీ ఐక్యం చేయడం కోసం తన జీవితమంతా పోరాడారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జోన్ కమిటీ సభ్యులు వి.మాణిక్యం, కె కృష్ణ, మధుసూదన్ రావు, శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు పి.అమృత్ గౌడ్, లక్ష్మి నారాయణ, శ్రీనివాస్, ప్రణయ్, ప్రజా సంఘాల నాయకులు గరికపాటి రవి, సంతోష్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.