నమస్తే శేరిలింగంపల్లి: పేదలను ఓట్ల కోసం మాత్రమే వాడుకుని అవసరం తీరాక రోడ్డున పడేయడం సరికాదని మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి లోని బసవతారక నగరవాసులను మంగళవారం మాజీ శాసనసభ్యులు బిక్షపతి యాదవ్, బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బిజెపి నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా బిక్షపతి యాదవ్ మాట్లాడుతూ శాసనసభ్యుడిగా ఉన్నపుడు బసవతారకనగర్ లో కరెంట్ లైన్, గుడిసె లు వేయించడం జరిగిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రస్తుత ప్రజాప్రతినిధులు పేదలను ఓట్లుగానే చూసి రాజకీయ పబ్బం గడుపుతున్నారని వాపోయారు. ఉంటున్న గుడిసెలను నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేసి నిరుపేదలను రోడ్డున పడేయడం సిగ్గుచేటన్నారు. బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా నివాసముంటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటు హక్కును ఇదే అడ్రస్ మీద కలిగి ఉన్న స్థానికుల ఇళ్లను ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ధ్వంసం చేయటం అమానుషమైన చర్య అన్నారు. పసి పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఉన్నారన్న కనీస ఇంగితజ్ఞానాన్ని మరచిన ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ బాధితులకు తక్షణమే కూల్చిన ఇళ్లకు నష్టపరిహారం కల్పిస్తూ వీరికి ఉన్నచోటనే ఇళ్ల పట్టాలను కేటాయించాలని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేసేలా చూడాలన్నారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ నిరుపేదలకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.