శేరిలింగంపల్లి, నవంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ సర్వే నంబర్లు 100, 101లోని 550 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, ఆ భూములను విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రవికుమార్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించారు. మియాపూర్‌లోని 550 ఎకరాల్లో సుమారు 150 ఎకరాల్లో ఎం.ఏ. నగర్, స్టాలిన్ నగర్ వంటి కాలనీలు ఉన్నాయని, మిగిలిన 400 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయించకుండా ప్రజా అవసరాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ భూముల్లో పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాల, పార్కులు, నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించాలని సూచించారు. ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించే ప్రయత్నాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. కాలనీల్లో నివసిస్తున్న పేదల ఇళ్లకు నష్టం కలిగిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే శేరిలింగంపల్లి నుంచి పోరాటం ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపడతామని ప్రకటించారు. ఎం.ఏ. నగర్ కాలనీని సందర్శించి బాధితులతో మాట్లాడిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రవికుమార్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మాణిక్ రావు, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు విజయేందర్, డివిజన్ అధ్యక్షుడు ఆకుల లక్ష్మణ్, శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సీతారామ రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు గణేష్ ముదిరాజ్, సీనియర్ నాయకులు రాఘవేంద్ర రావు, నాగేశ్వర్ గౌడ్, సమ్మెట ప్రసాద్, మహేష్ యాదవ్, రాజేష్ గౌడ్, రాము, ప్రకాష్, ప్రవీణ్, స్థానిక బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.






