నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న డ్రైనేజీ, మంచినీటి సమస్యలను పరిష్కరించేలా చూడాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిశోర్ కు విజ్ఞప్తి చేశారు. సోమవారం జలమండలి ప్రధాన కార్యాలయం లో జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ ను శేరిలింగంపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ కలిసి నియోజకవర్గం లో పరిష్కరించవలసిన పలు సమస్యలపై చర్చించారు. డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి నిధులను మంజూరి చేయాలని గాంధీ కోరారు. వివేకానంద నగర్ కాలనీ లో మంచినీటి నిల్వ సామర్ధ్యం పెంచాలని, నల్లగండ్ల కాలనీ లో ఎస్టీపీ నిర్మాణం చేపట్టాలని, నల్లగండ్ల కాలనీ లో పెరుగుతున్న జనావాసాలకు అనుగుణంగా అసంపూర్తి మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం కోసం, అదనంగా మరో 70 కి.మీ ల మంచినీటి పైప్ లైన్ నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని కోరారు. హఫీజ్ పేట్ ప్రజాయ్ సిటీ వాసులకు మంచినీటి క్యాన్ నెంబర్ కేటాయించేలా చూడాలని, అదేవిదంగా బకాయి పన్నుల వసూళ్లను సీవరేజ్ పన్నుల బాకీ వసూళ్లపై పేదలు ఇబ్బంది పడుతున్నారని, ప్రస్తుతం కడుతున్న పన్నులను దృష్టిలో పెట్టుకొని బకాయిల వసూళ్లను ఒత్తిడి చేయరాదని కోరారు. కూకట్‌పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీలో బకాయి పడ్డ సీవరేజ్ సెస్ వన్ టైం సెటిల్మెంట్ కింద పరిష్కరించాలని, అక్కడ నివసిస్తున్న ప్రజలు పేద, మధ్య తరగతి చెందిన వారని పెద్ద ఎత్తున ఉన్న బకాయిలను వారు చెల్లించలేని స్థితిలో ఉన్న దృష్ట్యా జలమండలి బోర్డు పెద్ద మనసుతో అలాంటి కాలనీ ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. సానుకులంగా స్పందించిన జలమండలి ఎండీ దాన కిషోర్ ఆస్బెస్టాస్ కాలనీలో బకాయి పడ్డ సీవరేజ్ సెస్ వన్ టైం సెటిల్మెంట్ తగ్గింపు పై సుముఖత వ్యక్తం చేశారు. అదేవిధంగా సీవరేజ్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని, విడతల వారీగా నిధులను సమకూరుస్తానని చెప్పారు. బకాయి పన్నుల వసూళ్ళలో విషయంలో సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ విప్ గాంధీ జలమండలి ఎండీ దాన కిశోర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.