నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడం జరుగుతుందని రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి స్వరాజ్య లక్ష్మీ తెలిపారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మీ సందర్శించారు. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం మాదాపూర్ ఎన్ టీ టీ డాటా బిజినెస్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో ఆస్పత్రిలోని కుష్టు రోగులకు దుప్పట్లను, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న సేవలకు ప్రైవేటు సంస్థల సహకారం తోడవుతే రోగులకు మెరుగైన వైద్యం దక్కుతుందని అన్నారు. ఈ క్రమంలో కుష్టు రోగులకు చేయూత అందించిన ఎన్ టీ టీ డాటా బిజినెస్ సొల్యూషన్స్ ప్రతినిధులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్, పీఎంఓ సులోచన, సంస్థ ప్రతినిధులు వినయ్ వంగళ, శ్రవణ్ తపవర్, ఏపీఎంఓ ఎ.రమేష్ నాయక్ తదితరులు ఉన్నారు.