ఓబీసీ సింహగర్జనకు భారీ స్పందన

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పీసీసీ ఓబీసీ చైర్మన్, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గొల్లపల్లిలో నిర్వహించిన ఓబీసీ సింహగర్జన మహాసభ విజయవంతమైందని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే వి. జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి సభను విజయవంతం చేశారని ఆయన పేర్కొన్నారు. సభకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి బీసీ సంఘం నాయకుడికి భేరి రామచందర్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.

సామాజిక సమతుల్యత, బహుజనుల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ సభ నిర్వహించినట్లు తెలిపారు. ఓబీసీల హక్కులు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో తగిన రిజర్వేషన్లు, జనాభా ప్రాతిపదికన వాటా కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. జిస్కీ జిత్నీ సంఖ్యా.. ఉత్నీ హిస్సేదారీ అనే నినాదాన్ని సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడం సంతోషకరమని భేరి రామచందర్ యాదవ్ అన్నారు. బీసీ యువత, మహిళలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని శంషాబాద్ గడ్డపై నిర్వహించిన సభను విజయవంతం చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. బీసీలంతా ఏకమై తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. పోరాటం ద్వారా హక్కులను సాధించుకోవాలని అన్నారు.

సభలో ఏఐసీసీ ఓబీసీ చైర్మన్ డా. అనిల్ జైహింద్ యాదవ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ చైర్మన్ మధు యాస్కీ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ మారబోయిన రఘునాథ్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్, ఏఐసీసీ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కోఆర్డినేటర్ కొప్పుల రాజు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. మేదరి సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు కుంటూ నవీన్, అందెల కుమార్ యాదవ్ తదితరులు కూడా సభలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here