నమస్తే శేరిలింగంపల్లి: గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తూ, విక్రయిస్తున్న నిందితులను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్ స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం బుధవారం గంగారాం ఎక్స్ రోడ్ వద్ద మారుతీ S-క్రాస్ వాహనంలో గంజాయి విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు చందానగర్ పోలీసులు ఆ కారును ఆపి విచారించారు. ఆంధ్రప్రదేశ్ అరకు నుండి మహారాష్ట్రలోని పూణేకు గంజాయి రవాణా చేస్తున్నట్టు గుర్తించి కారులోని నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి మారుతీ S క్రాస్ వాహనం, 99.320 కిలోల ఎండు గంజాయి, నాలుగు మొబైల్ ఫోన్లు, 7.8 గ్రాముల బంగారు గొలుసు, రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహారాష్ట్రలోని పూణే వాసులని, కిలో ఎండు గంజాయిని రూ. 1500లకు కొనుగోలు చేసి రూ.5 వేలకు విక్రయిస్తున్నారని తెలిపారు. గంజాయి తరలింపు విక్రయంలో భాగస్వాములైన కొబ్బరి వ్యాపారస్తుడు సచిన్ 35, మెకానిక్ సచిన్ సునీల్ కొండే (31), డ్రైవర్ తేజస్ శంకర్ మోర్ (30) లను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు లక్ష్మణ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.