సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్‌పై విద్యాశాఖ కొరడా.. కొండాపూర్‌లో పాఠశాల సీజ్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గోల్డెన్ టులిప్‌లో నిర్వహిస్తున్న సంస్కృతి (Sanskriti) ఇంటర్నేషనల్ స్కూల్‌ను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. పాఠశాల అనుమతులు, నిబంధనలపై విద్యార్థి నాయకులు చేసిన వరుస ఫిర్యాదులు, సుదీర్ఘకాలంగా కొనసాగించిన పోరాటం నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు. DEO ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి మండల MEO వెంకటయ్య ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులు పాఠశాలకు చేరుకుని స్కూల్‌ను మూసివేసి సీజ్ చేశారు.

సుమారు 1,500 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాల సుమారు 4,000 గజాల స్థలంలో కొనసాగుతున్న నేపథ్యంలో, పాఠశాల నిర్వహణకు సంబంధించిన అనుమతులు, ప్రభుత్వ నిబంధనల అమలు తదితర అంశాలపై సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. కేవలం పాఠశాలకు తాళం వేసి సీజ్ చేయడంతో సమస్య పూర్తిగా పరిష్కారం కాదని వారు పేర్కొన్నారు. పాఠశాల నిర్వహణకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? నిబంధనలు పాటించారా? విద్యార్థుల నుంచి ఎంత మొత్తంలో ఫీజులు వసూలు చేశారు? ఆ ఫీజుల లెక్కలు ఏమిటి? తదితర అంశాలపై పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించాలని కోరారు.

విచారణలో పాఠశాల యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చట్టపరమైన చర్యలతో పాటు అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. విద్య పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన ఫీజులపై సమగ్ర లెక్కలు పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాల సీజ్‌తోనే అధికారుల చర్యలు ముగియకూడదని విద్యార్థి నాయకులు స్పష్టం చేశారు. పూర్తి స్థాయి విచారణ నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి, బాధ్యులపై తుది చర్యలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ చర్యలు విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల నమ్మకాన్ని కాపాడే విధంగా ఉండాలని పేర్కొంటూ, సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో నవ తెలంగాణ స్టూడెంట్ యూనియన్ బైరు నాగరాజు గౌడ్, TVIV, OU JAC శంకర్ , రణధీర్ రెడ్డి, బీసీ సంఘం బబ్లు గౌడ్ (జస్వంత్), బహుజన సంఘ్ బొప్పని ఈశ్వర్, OU JAC గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here