నమస్తే శేరిలింగంపల్లి: అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్న అని, రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో వీఐపీ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో పీఆర్ కే హాస్పిటల్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సోమవారం కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర స్థితిలో ఉన్న రోగికి రక్తం అవసరం ఉంటుందని, రోడ్డు ప్రమాద ఘటనల్లో గాయపడి సకాలంలో రక్తం అందక చనిపోయినవారు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారని అన్నారు. నేటికీ రక్తదానంపై చాలామందికి సరైన అవగాహన లేక రక్తదానం చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు. రక్తదానంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్వచ్ఛంద సంస్థలు పట్టణాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేసి రక్తాన్ని సేకరిస్తున్నాయని, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసేవారికి ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పెట్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, వార్డ్ సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.